హనుమప్పనాయకుడు-షష్ఠాశ్వాసము అంత హనుమప్ప హస్తాంతనిస్రుతమైన క్షతజకూలంకషాప్రతిబింబమో నాగ బాఢతరరక్తిమాధ్వంబులే భాసిల్లె ప్రాగ్దిశారోదసీ వరదర్పణమునందు. ఆ ప్రత్యుషోరాగ మాగామిచండాంశు తీక్ష్ణతాసూచియై తిమిరంబు బోద్రోలె అత్యంతతేజస్వియౌ వీరు విక్రాంతి వార్తయే చాలదా వైరులం బోద్రోల? పూర్వదిశాకవాటమును పొంకముగా దొలగంగ ద్రోసి యాం ధ్రోర్వర నెల్ల హేమరుచిరోజ్జ్వలసుచ్ఛవిసూనగుచ్ఛముల్ గర్వముతోడ జల్లెను వికర్తనుడంత భవిష్యదాంధ్రమాऽ ఖర్వజయోత్సవార్థమయి కాంచనరథ్యల గూర్చెనో యనన్. శ్రీకంఠాలికమందు జెన్నొసగు చిచ్చో యనంగన్, మహా నాకారణ్యమునన్ జ్వలించు గహనాగ్నిచ్ఛటంబోలె, వి శ్వాకూపారమునన్ వెలుంగు బడబాగ్నిప్రతానంబటుల్ లోకేశుండు వెలింగె దూర్పుకడ రుంద్రప్రభోదీర్ణుడై. క్షితియన్ దుర్గము గెల్వబూని సరసీజేశుండు దానాక్షితిన్ జతురంతంబుల జుట్టియున్న యతలస్పర్శాంబరాఖాతమున్ వితతాంశూజ్జ్వలరజ్జుసంతతులతో వే వంతెనం గట్టి బల్ చతురుండై తరియించెనో యన సువిస్తారంబులయ్యెం బ్రభల్. మున్నె క్షయరోగమున జిక్కి సన్నబడితి ఇపుడు చండాంశులం జొక్కి యెండిపోతి నింక దివినుండ దగదంచు నిందుడంత మ్లేచ్ఛకేతనమ్ముల జొచ్చి మేలు గనియె. అట్లు నిర్వీర్యుడౌవాని నమర బూని తురకశిబిరాగ్రములయందు దురగలించు ధ్వజము లాగామిసమరసంప్రాప్యమాన పరిభవంబును సూచించు ధ్వజము లయ్యె. అపుడాంధ్రసర్వంసహాలక్ష్మివేణిలో ప్రతిభాసితంబైన రత్నహారములట్లు కోకనదవార మస్తోకప్రభల మీరె రమ్యతరతుంగభద్రావేణికలయందు. తొల్లి గగనాంచలమ్ములన్ వెల్లిగొన్న క్షతజనిమ్నగ యల్లనన్ క్షితికి డిగ్గి పాఱసాగెనొ యన రక్తవారిజాత పిచ్ఛిలచ్ఛవి యిలనెల్ల వెల్లివిరిసె. ప్రథమరుక్శాతనిస్త్రింశపంక్తిచేత చండకిరణుండు ధ్వాంతరాక్షసగళంబు లూనమొనరింప గాఱిన శోణితంపు వఱదలన బొల్చె రక్తాబ్జవారరుచులు. ఉరుతరవిక్రమస్ఫురణ నుక్కడగించి తురుష్కవారమున్ సురుచిరమందహాసమున శోభిలజేయును దెన్గులక్ష్మి సుం దరవదనారవిందమును దప్పక సోముడు నేడటంచు వి స్తరముగ జోస్యముం బలికె సారసితాంబుజకాంతిపుంజముల్. ఆంధ్రరాజ్యేందరాహాసమ్ములం దొల్కు మాధ్వీకముంబోలె మధురమంజులమయ్యె తుంగభద్రానదీతోయమాలికలందు నిస్రుతంబైన నవనీరజమరందంబు. తుంగభద్రానదీతోయమ్ములన్ మంగ ళాభ్యంజనస్నాన మాచరించి వలమానపత్త్రసంవ్రాతమున్ మేల్పట్టుపుట్టముగ మేన గట్టి నవజాతకంజాతనివహమ్ము నందముగ నవరత్నమాలగా సవదరించి పరిఫుల్లసురభిళప్రసవపాంసూత్కరము భద్రాతపత్రముగ బాదుకొల్పి కల్యకల్యాణ సుముహూర్తకాలమందు సర్వసర్వంసహారాజ్యసార్వభౌమ పదవి నభిషిక్తుడౌ రాచపట్టి మాడ్కి గర్వయుతుడౌచు గమియించె గంధవహుడు. అధికబలవత్తరుండైన యధిపు మ్రోల మండలేశులు మకుటాళి మంటినంట వందనంబులు సేసెడు భంగి దోప నిఖిలతరులతాదులు వంచి శిఖరపాళి వందనంబులు సేసె బ్రభంజనునకు. ఆ పవనాంకురంబువలె నాంధ్రచమూశిబిరమ్ములందు సం వ్యాపృతమయ్యె సోమవిభునశ్వము తేబడెనన్నవార్త, బ్ర ధ్నోపమమూర్తులౌచు దెలివొందెను దాన నపూర్వగర్వహ ర్షోపచితంబులై తెలుగుయోధగణంబుల వక్త్రబింబముల్. ఆ పవనాంకురంబువలె యావనసైన్యసమూహమందు సం వ్యాపృతమయ్యె నెవ్వడొ మహాధృతిశాలి సపత్నవీరు డ శ్వాపహృతిం బొనర్చె నిజహస్తముగూడ ద్యజించి యన్ ధృతి క్షేపక వజ్రకర్కశ విశేషవిపత్కర ఘోరవార్తలే. జాలయి పుట్టి, యాపయిని జారి జవాంచితనిర్ఝరమ్మునై, మేలగు వాగునై పిదప, మీద మహాపగయై చెలంగు కీ లాలవిధంబునన్ హయలలామము దెచ్చిన వార్త యాంధ్రభూ పాలకవర్గమం దపుడు ప్రాకె నభంగురభాగ్యదాయియై. వ్రాలినయాకులందు బ్రభవంబయి మీదట దీవజొంపముల్ కీలల బుగ్గిచేసి పయి గృత్స్నమహాటవినే గ్రసించు నా భీలదవానలంబువలె వీత్యపవారణవార్తయే తురు ష్కాళికి సోకె భావిసమయాగమిఘోరవిపన్నిమిత్తమై. అమితహర్షాప్తిచే జాల నరుణమైన ఆంధ్రయోధాస్యబింబంబు లపహసించె నపుడె యుదయించు బాలారుణాబ్జతతుల. అమితహర్షాప్తిచే జాల నరుణమైన ఆంధ్రయోధాస్యబింబంబు లపుడు దీర్చె చెందొవలు లేని లోపముం జిత్రముగను. అత్యంతభయవిచారాతురత నడరు యవనయోధుల కుంచితాస్యంబు లపుడు ప్రతిలేని సౌహార్దభావంబు గనియె ప్రమ్లానకైరవప్రకరమ్ములందు. ఆదినమందు సోమవసుధాధిపు డర్కసముగ్రతేజుడై ఆదిగ నస్త్రి పత్తి హయ హస్తి శతఘ్నులు గల్గు సేనతో హ్రాదిని దాటి శాత్రవ కురంగ కదంబ హరీంద్రుడౌచనిన్ మోదిలజేసె నాంధ్రరమ, మూర్ఛిలజేసె నరాతిలక్ష్మినిన్. ఆకస్మికమ్ముగా నఖిలాశలన్మూగి చీకట్ల బిగియించు జీమూతతతియట్లు, న్యగ్రోధముల గూడ నామూలముగ నూడి పడ గూల్చు బెడిదంపు సుడిగాలితెఱలట్లు, గండుశిలలంగూడ ఖండింపగా జాలు చండజవమున బాఱు గండకీవిధమౌచు, ఖాండవంబును మ్రింగ ఘనకరాళజ్వాలి కాజిహ్వికల జాచు కఱిదారి విధమౌచు, చండభండనపాండిత్యసారనిధులు తెలుగువీరులు తేకువ తేటపడగ నల్దెసలనుండి తుర్కల నావరించి చిత్తుచేసిరి; కాన్కగా మిత్తికిడిరి. ఆ యనీకాగ్రంబునం దాంధ్రభూవిభుడు చిత్రజవసత్త్వనిర్జితసూర్యవాహంబు నాత్మీయసైంధవము నధిరోహ మొనరించి చిత్రజవసత్త్వనిర్జితసూర్యుడై పొల్చి... తన బలముల గొనకొల్పుచు క్షణవిద్యున్నిభమున నరిగణముల మార్కొనుచున్ తునియలు సేయుచు నసి ద త్తనువులు దుర్దాంతవిలయతాండవమున దేలన్. "అల్లా! హరెయల్లా!" యని పెల్లార్చుచు దురకలు గడుబెగ్గిలి యంతన్ చెల్లాచెదరుగ బాఱిన దల్లక్షణముం గని యతిదర్పితమతియై. ఓడకుడోడకుం డనుచు యోధుల నొక్కట జేర్చి వారిలో వాడిమగంటిమిన్ మఱల వర్తిలజేయుచు, బ్రాగటూరి మ న్నీడు నవోత్థితాచలితనిష్ఠురకాలభుజంగమక్రుధా రూఢత రోజుచున్ రణనిరూఢి తలిర్ప నెదిర్చె సోమనన్. వీతుల ముందువెన్కలకు వేనురికించుచు, బాణివిస్ఫుర ద్ధేతుల విస్ఫులింగములు తీగెలువాఱగ, జైత్రమాసపున్ మోతుకులట్లు సంహననముల్ క్షతజారుణిమం దలిర్ప, బ్ర స్ఫీతకృపాణవిగ్రహవిజృంభణ దేలిరి వారలిర్వురున్. ఖడ్గాఖడ్గిగ నీవిధం బధికకౌశల్య మేపారగన్ ద్విడ్గోత్రేశుడు వోర, నొక్కపరి స్వీయాశ్వమున్ వెన్కకున్ త్విడ్గణ్యత్వర దట్టి, తక్షణమె వే ముందుకున్ నెట్టి, త ద్ద్విడ్గాత్రంబును దర్గె రెండుగ బ్రధృష్ణుండు సోముండొగిన్. శోణిత మేఱువాఱ నిటు సోమనధాటికి మ్రంది మ్లేచ్ఛరాట్ క్షోణికి గ్రుంగ గాంచి కడుక్షోభము జెందిన సైన్యరాశి, యా దోనివిభుండు ముందునకు దూకి విరోధిని దాకె వీక, నా సేనల యాత్మసీమలను స్థేమజిగీషల నారువోయుచున్. బిరబిర జంద్రహాసముల విస్తృతకౌశలదీప్తి ద్రిప్పుచున్, బొరిబొరి నశ్వరాజముల ముందుకువెన్కకు దట్టి నెట్టుచున్, చురచురలాడు ఖడ్గముల సోకున నిప్పుక లొప్ప గుప్పుచున్, స్ఫురదరుణాస్రబిందువులు జొబ్బిల గ్లాంతశరీరయష్టులన్. హుంకారంబులతోడ దిక్పటలి నుద్భిన్నముం జేయుచున్ లంకేశున్ రఘురాముబోలి యతులాభీలదోర్దండస ద్యోంకూరద్ఘనశౌర్యగర్వమున నన్యోన్యసంస్ఫోట ని శ్శంకోద్యోగమునం జెలంగిరి రుషాస్ఫూర్తి వారంతటన్. ఇటులెంతోవడి వారు ద్భటదర్పోద్ధతి బెనగగ బ్రశ్రాంతుండై యటమట జెందెను యవనుడు తటుకున సోముండది గని తటిదుపమితుడై. ఛెళ్లున నొక్కపెట్టునను జేసె ద్విఖండముగా నరాతిభూ వల్లభు గాత్రవల్లికను, వాగులువాఱగ శోణితంబు, హా! యల్ల! యటంచు భీతులయి యావనసైనికు లెల్లదిక్కులన్ చిల్లరపొల్లరై యురుక, చేరి తెనుంగులు వారి మొత్తగన్. ఈయనువున సోమన శౌ ర్యాయతి శాత్రవనృపోత్తమాంగద్వయమున్ బాయక తఱిగిన గాంచి త దీయానీకిని ద్విగుణితతేజోంచితమై. అత్యంతరయచలద్ధయఖురోత్థితధూళి చే దెసల జీకట్లు పాదుకొనగ, తళతళన్నిశితాసితతు లత్తమంబులో తోకచుక్కలరీతి దులకరింప, గాఢబృంహితభీదగజబృందముల్ ధ్వాంత గర్జదంబుధరసంఘములబోల, ఆధోరణస్తోమహస్తాంచితాస్త్రముల్ సంస్ఫురచ్చంచలాచయముబోల, దేశరక్షైకదీక్షయే తెరువు సూప, దుర్దమస్వామిభక్తియే తోడుగాగ, చెట్లుపుట్టలు వట్టుచుం జెదరిపోవ చిట్లగొట్టెను తుర్కలసేన ననిని. హాహాకారము లుప్పతిల్ల నిటు లయ్యావనుల్ బాఱగా నోహో పాఱకు, డోడకుం డనుచు నుప్పొంగి బళ్లారిరా డ్దోహంకారము మీర వారి బునరావృత్తులంజేసి, న వ్యాహావోత్సుకతం దదీయహృదయావిష్టముం జేయుచున్. తాడితకుండలీంద్రుని విధంబున ద్వేషవిషప్రపూర్ణుడై క్ష్వేడల నాశలం బగులజీల్చుచు, దంతవిఘట్టనంబుచే నౌడును గాటువార్చుచు, మహాగ్రహసంయుతి నభ్యమిత్త్రుడై ఈడితవైరిఘాతనసమీహితు డౌచు నెదిర్చె సోమనన్. కులశైలంబులు గ్రుమ్ములాడినటులన్, క్రుద్ధేభయుగ్మంబు ది గ్వలయోద్భేదకబృంహితార్భటుల వ్యాఘట్టించు చందమ్మునన్, బలవచ్ఛ్వాపదయుగ్మ ముత్కటరణవ్యాలోలమైనట్లు, వా రలు దీండ్రించిరి ద్వంద్వయుద్ధమున నిర్ద్వంద్వప్రతాపోద్ధతిన్. పొందుగా వీతులన్ ముందుకున్ వెన్కకున్ బ్రక్కకున్ గడువడిం బాఱజేసి, కరవాలముల ద్రిప్పి కవచసంధులయందు శత్రువున్ ఛేదింప జాల దివిరి, అన్యోన్యసంఘాతనాయత్తి దీవ్రాసి ఘట్టనంబులచేత గాడువఱచి, ఒక్కచో జూపి వేరొక్కచో వ్రేయు పూ న్కుల మున్నె తొలగి నిష్ఫలము సేసి, వారు వోరిరి; తత్ఖడ్గధారలందు డోలికారోహకేళీవిలోల యగుచు నెవరి వరియించు టుచితంబొ యెఱుగలేక చంచలించెను జయలక్ష్మి, చంచలాత్మ! రణ మత్యుత్కటమయ్యె, దేహములు ఘర్మాంభఃప్రసిక్తంబులై తనరెన్ గానుగమొద్దులట్లు, తొలగెన్ దార్ఢ్యంబు దేహంబులన్, చనె నాస్యంబుల గల్గు తేమనము, శ్వాసశ్రేణు లత్యంతమై వినవచ్చెం గడుదవ్వులం, బెరిగె నావేశంబు, లుజ్జృంభణల్. ఎంతోవడి వారిట్టులు సంతమసము నాతపంబు చందము వోరన్ శ్రాంతంబై బళ్లారిని యంతృహయం బిలకుగూలి యసువులు వాసెన్. అంత రయంబునన్ హయము నాంధ్రధరాపతి డిగ్గి మ్లేచ్ఛభూ కాంతుని దార్కొనెన్ బ్రళయకాలసముచ్చలవాత్యయో, తటో త్క్రాంతసముచ్ఛ్రితోర్మిభయదాంబుధియో యన విస్ఫురత్సము ద్భ్రాంతనితాంతదారుణకృపాణసమంచితసిద్ధహస్తుడై. వేయియేన్గుల శక్తితో విక్రమించి తన్ను దార్కొను నాంధ్రభూధవుని ధాటి నల్పముగ నెంచి జాల్మత యవననేత ఏమఱెను సుంత; పరికింప నిట్టివే య గుంగదా మృత్యుదేవతోత్సంగమందు విశ్రమింపగ జనువారి విధములెందు. ఖంగున దాకె సోమవిభు ఖడ్గము; విచ్చెను నూరువ్రయ్యలై చెంగున మ్లేచ్ఛనాయకుని శీర్షము; పాఱెను వఱ్ఱులౌచు యు ద్ధాంగణమందు శోణితము; ఆఱెను మ్లేచ్ఛవరూథినీమనో రంగములందు మిన్కుమను ప్రాహవకౌతుకదీపమాలికల్. వరుసగ మువ్వు రేలికలు వహ్నిసమానసముగ్రవిక్రముల్ నెరసులువోలె నేడ్తెరను నెట్టన ప్రాభవమేది నీల్గినన్ దరికొన మానసమ్ము, లతిదైన్యత గాంచి తురుష్కసైనికుల్ పరిమిళితావమానభయబాధితులై వడి బాఱసాగినన్. "తగదు తగదు, పాఱదగదు వీరులార! మగలుగారె? మీదు మొగములందు మీస లింక మొలువలేదె? జంకుదొలగి యంత కాంకపాళిభాగ్య మరికి గూర్పలేరె? ఢిల్లీ నేలిన మనకొక చిల్లరరాయనికి జిక్కి చేడ్పడి పాఱం జెల్లునె? పందలుసైతము గొల్లున నగరే యిదివిన గుతుకముతోడన్? రండు రండు, పోరరండు, రండికన్ చండవాత్యరీతి సంత్వరన్ త్వరన్ త్వరన్ కుండలించి వైరిమండలమ్ములన్ పిండిసేయ రండు, రండు రండికన్." అనుచుప్పొంగి నిజాముధాత్రిపుడు వీరావేశసంపూర్ణభా షణచాతుర్యయుతిన్ నవీనకదనోత్సాహప్రరోహంబులన్ తనయోధాళుల యాత్మసీమలను సంస్థాపించు యత్నంబు దా నొనరం జేసెనుగాని ద్రావితచయం బుప్పొంగె రెండింతలై. గతజలసేతుబంధనముకైవడి, నేడసమక్షకాహళా తతనినదంబురీతి, దృషదంతరవాపితబీజమట్లు, వి స్తృతలవణార్ణవోర్మికల జిల్కిన క్షౌద్రపృషంతులట్టు లా యతనములెల్ల నిష్ఫలములై చన యోధుల గ్రమ్మఱింపగన్. చండజవంబగు ఝంఝకు లోబడి ఖండములై చను ఘనములరీతిన్, బండలపై గడుబలముగ బాదిన కుండలరీతిన్, గుంఠితధృతులై దండల రాగన్ ధ్వజినీపతులున్ మండలపతులున్ చండజవద్రవ పాండితి మీరం బాఱె నిజామున్. ఆపగనుండి వెల్వడు శతాధికకుల్యలువోలె బారులై రూపఱ శౌర్యధైర్యములు, రొప్పుచురోజుచు బాఱి వారు సం ధ్యాపటి ధాత్రి గప్పు సమయానకు గందనవోలు దుర్గపుం బ్రాపును జొచ్చి కాంచిరి నవాహవశౌర్యనిరంకుశత్వమున్. చండతరప్రతాపమున శాత్రవవీరుల వెంటనంటి తా నండగరాగ నల్పమగు నాహవపండితవర్గ మాంధ్రభూ పుండును జొచ్చె దుర్గమును; పూర్ణజయంబును గాంచకుండ ద్విట్ ఖాండవదాహకుల్ మఱలగల్గుదురే రణమధ్యమందునన్! కాని యాచొఱవ ప్రమాదకలితమయ్యె, అల్పబలయుతుం డాంధ్రేశుడంచు నరసి నారు; వెంటనే బిగియించినారు మ్లేచ్ఛ భటులు దుర్వారదుర్గకవాటములను. అంతలో గొల్లలుగ నితరాంధ్రయోధు లటకు నేతెంచినారు; దుర్గారరంబు లర్గళాకీలితములౌట నరసినారు; ప్రభుని దుర్గతి కెంతయో వగచినారు; సేతలెఱుగక బయటనే చిక్కినారు. ప్రాలేయగిరితుంగపాషాణనిర్మిత ప్రాకారకుడ్యంబు బ్రాకలేక, అల మృత్యుదేవతాతులభయంకరజిహ్వి కలబోలు తల్పులం గడువలేక, యమకిరీటంబులో యనమించు బురుజులం గల వైరిభటధాటి నిలుపలేక, ఘనఫణంబులబోలు గవనుకొమ్మలనుండి పడు చిచ్చువాన సైపంగలేక, ఒదవు ప్రాణినష్టమ్మున కోర్వలేక, ప్రభుని మృత్యుదంష్ట్రల బెట్టి పాఱలేక, ధాటి విరమించి యాంధ్రులు కోట కనతి దూరమున జేరి యోచింపదొడగి రిట్లు. అల్పబలాన్వితుండగుచు నక్కట! భూపతి చిక్కె శాత్రవా నల్పచమూసమూహగహనాంతరమందున, నెట్లొ దుర్గపుం దల్పుల జీల్చి యాతనికి దద్దయు దోడగుటుండె, లేనిచో గోల్పడి శౌర్యధైర్యముల గొబ్బున బాఱుటయుండె మన్కికై. రెండే మార్గములుండెను; రెండవమార్గమగు నతినికృష్టము; పెనురా గుండున బీయూషంబును బిండుటవంటిది యగు దొలివిధముం దలపన్. అనుచు గర్తవ్యమూఢులై మనములదుర యోజగావించు సోదరయోధగణము నరసి నిరుపమానధృతిసమంచితాత్ము డగుచు హనుమప్పనాయకుం డనియె నిట్లు. "సోదరులారా! యీ ని ర్వేదవితర్కంబులేల? గ్రీష్మార్చిష్మ త్సోదరవిక్రాంతి నమి త్రోదరముల గాల్చుటొకటె యుక్తముగాదా! వీరులు, స్వామిరక్షణపవిత్రకళానిరతాంకితాంగధీ సారులు, సద్వివేకపథచారులు, శాత్రవరాక్షసాటవీ చారులు, త్యాగయోగగుణసారులు, నాంధ్రధరాసతీశుభం కారులు నాదు యోధులని క్ష్మాపతి యాత్మను నమ్మియుండగన్. వీకను వీటిబుచ్చి పృథివీశుని దుర్కలనోట బెట్టి, ని శ్శ్రీకముజేసి యాంధ్రధర, జివ్వను బాఱుటకంటె నున్నదే లోకవినింద్యమైన పని? లోభములేటికి రేపొ,మాపొ కా రాకులువోలె రాలు తనులాంధ్రధరార్థము నేడె రాల్పగన్? మనపై నిల్చెను యావదాంధ్రజనతామానావమానంబు లీ యనిలో గెల్చితిమేని నిల్చు నిలలో నాంధ్రాళికీర్తిధ్వజం బినతారేందువు లుండుదాక, నజయంబే చివ్వ బ్రాప్తించినన్ జినుగుం దెన్గుయశఃపతాక పరదాసీత్వప్రఝంఝాహతిన్. మన భుజదండంబుల దమ మనుగడ నిడికొన్న వృద్ధమాణవకస్త్రీ జనముల యవనాసికి బలి యొనరించి సుఖంబున నిల నుండంగలమే? పాటలీపురి నాంధ్రపాలనమ్మును నిల్పు శాతకర్ణులనాటి సంగ్రామపాటవంబు, దిగ్దంతిముఖములన్ దిగ్జయోదంతముల్ విలిఖించు గాకతీయులనాటి విక్రమంబు, పంచపాండవులట్లు పరిపంథిమంథన ప్రవణులౌ పల్నాటివడికాండ్ర ప్రాభవంబు, కుండలీంద్రములట్లు క్రూరయవనానీక ముల మ్రింగు కృష్ణరాయల చమూసాహసంబు, పెంపు గావింప నిత్యాభివృద్ధి గాంచి సర్వజగతికి నీర్ష్యాభిజనకమైన తెనుగువిభవంబు గాపాడుకొనగలేని అసువులేటికి యోచింపు డన్నలార! తుంగభద్రానదీతోయవల్లికలట్టు లుల్లుముల విజిగీష వెల్లువగుగాత! శ్రీవిరూపాక్షఘంటావిరావములట్లు క్ష్వేడముల్ గడలందు బిక్కటిలుగాత! విద్యాపురీవప్రవిస్ఫురద్ధ్వజరీతి ఘనరణోత్సాహంబు వినుదాకుగాత! విశ్వనాథుని స్వామివిశ్వాసమును బోలి డెందముల బ్రభుభక్తి ద్విగుణమౌగాత! భవ్యకృష్ణరాయాధిభూపాదకటక కీలితయవనరాడ్ప్రతిమాళి యగుత అస్మదీయాహవోద్యుక్తి కమరునట్టి ఉత్తమోదర్కముం దెల్పు పుత్తలాళి! ఎత్తినకత్తి దింపక యహీనపరాక్రమదీప్తి వైరిభూ భృత్తుల కుత్తుకల్ దరిగి ప్రీతునొనర్పుడు శ్రాద్ధదేవునిన్, కుత్తుకబంటిగా విపద గూరుకపోయిన ఱేనికండయై యెత్తుడు కందనోలుపయి నిమ్ముగ దెల్గుల వైజయంతికల్." అనుచు దా సంత్రుటితహస్తు డగుటకతన సమరమున బాల్గొనంగ నశక్తుడయ్యు నభినవాయోధనోత్సాహ మాంధ్రవీరు లందు నెలకొల్పుచున్ హనుమప్ప వలుక. రాకాంభోధి విధంబున నాకూతంబులు సెలంగ నవ్యాహతవీరో త్సేకముతో, దనువులు వ ర్షాకాలక్షేత్రములటు సంపులకితములుగాన్. తెలుగుచమూసమూహములు తేటపడం బ్రభుభక్తి యుత్తమం బులు, హిమవన్నగోపమసమున్నతదీర్ఘకఠోరగాత్రముల్, బలజితదిగ్గజంబులగు బంధురసింధురకుంభసీమలం బొలపము మీర గాఢముగ బూన్చి యయఃకృతపీనపట్టముల్. సుర ద్రావించి, తదీయ ద్విరదేంద్రంబుల నొనర్చి తీవ్రోన్మత్తబలో ద్ధురములుగా, నుసికొల్పిన నఱవఱలొనరింపగ వరణారరముల నంతన్. చరదచలేంద్రసంతతులచందము బారులుదీఱి యొక్క కుం జరము కవాటయుగ్మకము స్ఫారబలోద్ధతి గ్రుమ్మి వెన్కకున్ దిరిగెడులోన వేఱొక యనేకప ముద్ధతి దాకి క్రుమ్మినన్ నెఱియలువాఱి చండతరనిస్వనసంయుతి వ్రీలె దల్పులున్. వారని వర్షధారలకు భంగమునందిన వారిబంధమున్ స్ఫారతరప్రకంపనవిపాటితమైన ధరిత్రిగోళమున్ భారము నోపజాలక గుభల్లున గూలిన యద్రిసానువున్ వారక పోలు చావరణబాఢకవాటము వ్రయ్యలై చనన్. అంత గండిలోనుండి యత్యంతవేగ వంతముగ జారుకొను వారిభంగి దోప గవను గమియించి యాంధ్రభూకాంతు సేన నేల యీనినయట్లు లోనికిని జొచ్చి. భానుసమానతేజుడయి స్వల్పబలాన్వితుడయ్యు శాత్రవ శ్రేణుల మేను లాహుతిగ జేసి కృతాంతుని దృప్తుజేయుచున్ బూనికమీర బోరు నలభూపతి జేరగబోయి చయ్యనన్ రాణ తలిర్పగా తురకరాణువల న్వలయించి పోరినన్. ఆయువు చెల్లె నెందఱికొ యావనసైన్యమునందు, నాంధ్రభూ నాయకమౌళికిం గలిగె నవ్యతరంబగు స్వేచ్ఛ, యంత ని శ్శ్రేయసమబ్బు నందఱికి శీఘ్రమె పాసి యరాతిదుర్గమున్ స్వీయకుటీరపాళికల జేరిన నంచు దలంచి సోముడున్. హరిణసమూహమున్ భయసమాకులితంబుగజేసి స్వీయకం దరమును జేరు శ్వాపదగణాధిపుచందము జేరె స్వీయసుం దరశిబిరాంతరమ్ము నిరుదండల వ్యాఘ్రకిశోరసన్నిభుల్ శరధిసమానధైర్యులగు సద్భటు లాదృతి జేరి సాగగన్. తెనుగునృపాలచంద్రముని తేకువ యింగలమై దహింపగా దనువుల నాత్మలన్, యవనధాత్రిపు లామఱునాడు గూడి యీ యనువున యోజచేసిరి, "మహాబలసంయుతి దాక జయ్యనన్ మన చరణాల వ్రాలు గతమత్సరుడై నలసోముడంచు యో చన యొనరించి వచ్చితిమి; సర్వము బాసితిమక్కటా! యనిన్. చెల్లిరి మూడులోకముల శ్రీ వహియింపగజాలు వీరు లా బళ్ళరినాయకప్రముఖపార్థివు లెందరొ; సైన్యమందునం ద్రెళ్లెను మూడుభాగములు; తేకువలాఱెను దక్కుసేనలో చెల్లదువో జయంబు గొన జివ్వను నీస్థితి నెవ్విధంబునన్. వైరులమయ్యు నాంధ్రజనపాలుని స్థేమము, గార్యదీక్ష, ద ద్వీరవరూథినీమహితవిక్రమముం గొనియాడకుండగా నేరము; స్థేమ మెవ్వరిదొ నిక్కముగా జయలక్ష్మి వారిదే, వారక సంధి గూర్చుకొని వర్తిలుటే నయ మానృపాలుతోన్. మాటలు పెక్కులేటికి? అమానుషవీరుడు సోమనాద్రి, మో మోటలు మాని యావిభుని మ్రోలకు నిప్పుడె పంపగా దగున్ మాటలపొంకముం గలుగు మానిసి నొక్కని సంధిసేయ, సం స్ఫోటము మాన్పి యస్మదసువుల్ పరిరక్షణసేయగా నొగిన్." సంధియత్నంబు తన కనిష్టంబె యయ్యు గుయ్యిడక యింత తలయూచె సయ్యదుండు నయముచే లొంగని ఖలుల నడత దీర్ప భయమె యద్వితీయౌషధం బగునుగాదె! వైరులంపిన రాయబారమ్ము నాలించి వాహినీపతిమంత్రివరులతో జర్చించి ఆంధ్రభూపతి యంత నాశ్రవము సూచించె సంధి మెత్తురుగదా శాంతికాముకు లెందు! ఆదోనికందనోలవనీశులకు జెందు ధరయందు భాగంబు దాను బొందె, గోనబుద్ధారెడ్డిగోత్రేశనిర్మితం బులు, రాయచూర్పురీభూమిపాల వరణస్థితంబులౌ వరరామలక్షణా హ్వయశతఘ్నిద్వయప్రాప్తి నందె, కర్నూలుదుర్గాన గల్గు కొండారెడ్డి క్రొత్తళంబున కలంకృతిగ నున్న యెల్లమాహ్వయమైన బల్లిదంపు ఫిరంగి గలహంపు బణముగా గాన్కనొందె, ఘనసపత్నాధిభూ రత్నఖచితఖడ్గ సంతతుల, బహువిధమణిస్వర్ణభూష ణాదుల నుపదగా నొందె నాంధ్రవిభుడు సంధిషరతుల క్రింద మ్లేచ్ఛాళినుండి. ఈపగిదిన్ జయలక్ష్మీ ప్రాపితవక్షుడయి యాంధ్రరాణ్మణి గద్వా లాపురి నమరావతి లే ఖాపతి చందమున డాసి ఘనమోదమునన్. మునుముందుగా నిస్సహణ శంఖ దుందుభి స్వనముతో వాదిత్రగణము నడువ పైని, "యవనాటవీపావకా! బహుపరాక్ నలసోమ!" యని వందికులము పాడ, మీద గజవాజితతిమీద విస్ఫురితాస్త్ర పాణులై బహువీరవరులు వోవ, ఉపరి నానావిధాయుధకనత్పాణులై కాల్బలమ్ములు శ్రేణిగట్టి సాగ, రణవిజయకారణంబైన రమ్యభద్ర సైంధవోత్తమాసీనుడై సరస నొక్క వారువముమీద హనుమప్ప చేరి సాగ నగరి జొచ్చె నాంధ్రావనీనాయకుండు. నరనారాయణు లట్టుల పురముం జొచ్చిన హనుమపభూమీవిభులన్ బరికించి ముదంబున బొం దిరి యనిమేషత్వము జననివహము లంతన్. అతడటే! ఓయక్క! ఆంధ్రీముఖంబునన్ ఘుసృణంపు దిలకంబు గూర్చువాడు! ఇతడటే! నెచ్చెలీ! క్షితినాథుకోసమై హస్తముం బలిచేసినట్టి దిట్ట! చూచితే! ఓతండ్రి! క్షుద్రయవనేశులం బ్రుంగించి లోకముం బ్రోచు ఱేని! వీక్షించితే నాథ! విజయకారణమైన యశ్వముం గొనితెచ్చినట్టివాని! ఆంధ్రధర గావ బ్రభవంబునందియున్న కఱ్ఱికవ్వడులే వీరు కుఱ్ఱలార! ఆంధ్రవిభవంబు గావంగ నవతరిలిన రామహనుమంతులే వీరు రామలార! అని విస్మయగర్వకలిత మనోంబుజాతులయి ప్రజలు మన్ననసేయన్ కనకలతాంగులు క్రొన్నన లను గురిపింపగ భవనతలాంచితు లగుచున్. చనుదెంచెడు విభునిన్, వా హిని నాహ్వానించెను వరకృష్ణాపగ, వ క్త్రనళిననిర్యద్భృంగీ గణముల స్వాగతమనోజ్ఞగానము లెసగన్. శీతలకృష్ణాతటినీ వాతము లంబుజసుగంధపరిణద్ధములై వీతమొనర్చెను ప్రస్థా నాతపమున్ వాహినికిని నవనీపతికిన్. తిరుమలవంశవార్ధిశశి, ధీరవిధేయుడు, భారతీకృపా వరవిదితాంధ్రవాక్సరణివైభవు, డిద్ధఖగోళశాస్త్రమం దురుగణనంపు శాస్త్రమున నుజ్జ్వలశేముషి కల్గువాడు, శ్రీ కరమగు నుత్తరామెరికఖండనివాసియు నైనవాడునున్. శ్రీకృష్ణదేశికాఖ్యుడు శ్రీకరముగ జెప్పె దీని శిష్టాంధ్రచరి త్రాకాశనభోమణి, లో కైకయశోఘృణి యగు హనుమప్పచరిత్రన్. ******