అశ్రుమాల-ద్వితీయసరము ఓ పృథ్వి! కణకణంబున మన్మ నోవ్యథం జీర్ణించుకొన రావె! తరుణికడ గోధూళితరుణాన తత్ప్రదర్శనమొనర్పం జనవె! ఓ దీప్తి! కన్నార నా దైన్యముం గనుమ! స్వీయనేత్రోన్మేషవిధి జేసి నాకాంత శతపత్త్రసంతతుల సంఫుల్లమొనరించు నాశుభాహాన దౌత్యమ్మొనర్పం జనుమ! ఓ గంధవహనుండ! నాకుందు నువిదకున్ విన్నవింపగ రావ! వరగంధవహనాంకము న్నీవు ప్రఖ్యాతమొనరించుకొన రావ! దేశయాత్రలు మాని ద్వీపినీజలజాస్య! నాకింత మేలీ వొనర్పంగ రారాదె! చెలిచెంత నావంత జేర్పంగ బోరాదె! లావణ్యరసపుష్టి గావించు చెలి నీకు! ఓ గగనమా! నాదు క్రందన మోపి వినుమా! మత్ప్రణయినీ భర్మకాంచీ మంజుఘంటిక లలఘుశోభనరుతుల నొప్పెడు నాక్షణంబున నాదు గాథను జెప్ప దయతో నటకు జనుమా! మాకందపూరుషున్ మమతమై లాలించు నో మాధవీసాధ్వి! నామాట లాలించి చెలిచెంత నావంత జేర్పంగ బోరాదె? నిను మంచు నాకాంత నెయ్యంపుగౌగిళుల! సుందరికి నాకుందు నో జ్యోత్స్న! పొందించి నీవైన బూని తెల్పగరాదె! విందొనర్చుం గుందరదన మృదు మందహాసామందకందళంబుల నీకు! ఓ ఘనుడ! నాదు నశ్రూదకము ద్రావి వర్షింపజని రావ చెలిచెంగటన్! నా ఘోష సాంతముగ నాలించి గర్జించి మఱిరావ గజయాన ముంగటన్! "ఫుల్లాక్షి! నీదు వాల్చూపుచాల్ వెల్లిగొను మద్విలోచనయుగము బెల్లేచి యశ్రు లుల్లోలమై కల్లోలితము జేయు నీక్షణము! చంద్రాస్య! నీయాస్యచంద్రికా సారమజ్జితమైన మత్తనువు వ్యథితమౌ నుష్ణమలినాశ్రుధా రావగాహితమౌచు నీక్షణము! తారుణ్యవతి! త్వత్పరీరంభ సారకుంభాపూర్ణ సుమనోజ్ఞసుఖశీథుసేవాప్రశోణమౌ మత్ప్రమ త్తాక్షిద్వయము, త్వద్వియోగవ్యథాకుంభనిస్స్రావి తాశ్రురససేవనంబున శోణమై తనరు నీనాడు! అంగనా! త్వత్పరిష్వంగాను షంగాన సామౌ మదంగంబు సామయ్యె దత్స్మృతిజసంక్లేశ సంపరిష్వంగానుషంగాన! మంజులాంగిరొ! నీదు మంజీరగీతికా వైతాళికత్వాన బ్రత్యహము మేల్కాంచు నన్ను నిచ్చలు మేల్కొనగజేయు ధారాశ్రు జలపాతకలితార్తసంరావమే నేడు! శృంగారవతి! నీదు సాంగత్యరమ గల్గ దర్పకుండౌచు నను దన్పు నాత్మభవుండె కందర్పతన్ శాతకంజాస్త్రఘాతముల ప్రాణమ్ము లెడలించు భయదమారుండయ్యె! శోణాధరా! నీదు ముఖరక్తి మానుబింబనశోణమౌ మత్క పోలంబు నిశ్శోణితంబౌచు గ్రాలు నేడు దినేందునిభమౌచు! వనిత! నీరాగరసధారాభి వర్ధితము, మజ్జీవననదమ్ము విరహసంతప్తసికతమ్ములన్ వీగిపోసాగె నిర్జీవమై! నా యభ్యుదయనవ్యనవమాలికాలతిక నీ స్నేహభూమిలో నెగడియుండెను గాని నేత్రాంబునిర్ఝరీనిబిడ మీ వర్షయం దుత్పాటితంబయ్యె నునికింతయున్ లేక! నిబిరీసనిస్పృహాన్వితతమస్వినియొ? తతనిరాశావృతనితాంతదుర్దినమొ? ఏది నిండెనొ జగతి నే నెఱుగలేక నిదురవోనైతి, నిదుర దొఱంగనైతి! పల్లవించెడు కోర్కివల్లికల గోయంగ లేక, కోయకుండంగ మదికోత వారింపగా లేక, ఒకపరి యహింస, వేఱొక్కపరి హింసయే నా మ తమ్మైన నైతి సంధ్యాహముల రణభూమి నేను! నా హృదయఖని నిండు నవ్యానురాగ పద్మరాగముల గొని పాఱితివి నీవు, నేత్రాంబువర్షంబు నిండింప దద్బి లమె శోకవార్థియై యమరె నీనాడు! రాసిక్యసంపదప్రచురంబు నా హృదయ సామ్రాజ్యపట్టంబు సరగ గట్టితి గాని రాజ్యమెల్లను గొల్లలాడుచు మఱుక్షణమ పాఱె దీవంచు దలపగనైతి గలనైన! అనివార్యవిధికర్షకాపాలితంబు, నేత్రాంబునిమ్నగానిశసేచితంబు, మజ్జీవనక్షేత్రమం దవిరతంబు శూన్యతాసస్యంబె సొరిది జెన్నొందె! మద్వితతహృచ్చషకమందు నిండారు అనురాగమార్ద్వీక మంతయుం ద్రావి నీవేగితివి, కాని నింద్యమైపోయె చీమకుం గొఱగాక జీవితము నేడు! గళమెత్తగాలేని కలకంఠరీతి, పురి విప్పగాలేని వరకేకిరీతి, పరువెత్తగాలేని హరిణమ్మురీతి చేష్టలిల్లను దక్కి చేడ్పడితి నేను!" అనుచహోరాత్రముల హద్దులే కనలేక, మాసాబ్దముల భేద మసలే యెఱుగలేక, వ్యాలోలకల్లోలాకులితహంసవోలెన్ తుంగానిలతరంగాహతలవంగివోలెన్ ఆధూతచిత్తుండనై యనునిమేషమ్ము మూర్ఛిల్లుచున్, మూర్ఛవో మెలంగుచు, మూర్ఛ దూలుచు న్మఱి మూర్ఛదేలుచున్ నిస్సీమ ముగ నుందు నేనంచు ముగుదకు న్వివరింపు డో పంచభూతములార! ఓ మాధవీ! ఓ పయోదాన్వయవరా! ఓ కౌముదీ! ****** ఓఘనపథంబ! రమ్మో ఘనుడ! కైకొనగ! పాద్యమియ్యదె మీకు పరిశుద్ధఘనరసము! మాల్యమియ్యదె మీకు మహితాభ్రకుసుమమ్ము! భోజ్యమియ్యదె మత్ప్రభూతార్తరావమ్ము! ఓ తేజమా! కృపాచేతమ్మునం గొనుము! పాద్యమియ్యదె నీకు పూతపాథోధిజీవనము! మాల్యమియ్యదె నీకు చెల్వమరు తేజనీసుమము! భోజ్యమియ్యదె మద్వపుఃపాండుతాగుణము! ఓ గంధవహమూర్తి! కొనవోయి ఊర్జితకృపాస్ఫూర్తి! పాద్యమిదె నీకు ప్రచలోర్మికాప్రవిలుఠద్బిందుతతి! మాల్యమిదె నీకు హేలాలసన్మంజరీసుమవితతి! భోజ్యమిదె నీకు మన్నిస్పృహాభోగనిశ్వాసతతి! ఓ నిమ్నగా! కృపాధీనతం గొనరమ్ము! పాద్యమిదె సద్యస్సముద్యత్ప్రసవరసము! మాల్యమిదె సురభిళామ్లానాంబుజస్రజము! భోజ్యమిదె మన్నేత్రపూర్ణాశ్రువారమ్ము! ఓ క్షమావతి! కూర్మి యుల్లసిల స్వీకరింపగ రమ్ము! పాద్యమిదె మేధ్యతరవర్షాప్రథమవారివారమ్ము! మాల్యమిదె ప్రాతర్హిమాంచత్పృషత్తారహారమ్ము! భోజ్యమిదె మత్పురాభోగస్మృతిజకృచ్ఛ్రగంధమ్ము! ఓ కౌముదీవధూ! స్వీకృతిం గొనుము! పాద్యమియ్యదె నీకు ప్రాలేయజలము! మాల్యమియ్యదె నీకు మంజులోత్పలము! భోజ్యమియ్యదె మన్మనఃపూర్ణకరుణమ్ము! ప్రేమమీర స్వీకరింపరావె మాధవీ! పాద్యమిదియె చూతపల్లవానురాగరసము! మాల్యమిదియె చూతమంజులప్రసూనచయము! భోజ్యమిదియె మద్వపుర్గతోరుకార్శ్యగుణము! సర్వవస్తుమయసంసారస్వరూపులౌ మీకు నా యాతిథ్య మెంతటి దనఘులార! ఐన, "అమృతాంశోస్సుధార్పణ"మను విధాన స్వీకరించి నను గృతి జేయుడు సుజనులార! కైరవంబులు గప్పె గలధౌతకంబళాల్ పథమెల్ల, హల్లకంబులు వెట్టె హారిమణిదీపికల్ సృతినెల్ల, బొండుమల్లెలు గట్టె మెండు శుభతోరణాల్ తెరువెల్ల, గండుతేటులు వాడె కల్యాణగీతికల్ గతినెల్ల అన్నియున్ శోభనపుజిన్నెలే క్రన్ననం జనుదేఱుడింకన్, ఎన్నినాళ్లకొ యిట్టి మంగళా సన్నకాలం బొదవుటింకన్. సితభానుపై గన్నెఱ్ఱజేసిన చెంగల్వబోని దానిన్, దినరాజుపై మోమెఱ్ఱజేసిన ప్రాగ్దిశంబోని దానిన్, ఎనలేని వెడమోడిచే నాయెడ బరాజ్ఞ్ముఖియైన దానిన్, నాకన్నియన్, నాపెన్నిధానమ్ము గాంచెడు నాక్షణంబ క్రొందిరిసెనమును గసుగందించు మార్దవము, క్రొందేనియం బలుచనందించు మధురిమము, కుందంబు తెల్లవో నందమౌ ధవళిమము, క్రందుకొను నుడులొంద నిందుముఖి పొందుగని కందొనరు మేనొత్తగదవె మాధవి నీవు! చందనము మేనలదు సౌగంధవతి నీవు! అమృతంబు గురిపింపు మమృతాంశుసఖి నీవు! హిమవారి జిలికింపు హిమశైవలిని నీవు! చలిసేత లలర నీ చెలువునం బొలయల్క దీరి తొలిమబ్బుతెర వీడి వెలుగు వెన్నెలకన్నెవోలె పులువోవ దరళించు దెలిముత్తెపుంబేరువోలె తొలివెల్గుకౌగిళుల దొవరుడుగు తూర్పుకడవోలె జెలువారు నాచెలిని జెన్నారు చెలిమిమై జేరి కారుణ్యసంస్థితిం జెప్పవే కౌముదీ నీవు! తీవ్రశోకస్థితిం దెల్పవే ద్వీపినీ నీవు! ఉరునిస్పృహాసక్తి నెఱజెప్పు కరువలీ నీవు! కార్శ్యముం జూపవే వాసంతికాసాధ్వి నీవు! పాండురత్వమ్ముం బ్రదర్శించు పావకా నీవు! స్మృతిసంగతక్లేశము న్వినుచు మేదినీ నీవు! ఆక్రందనమ్ము వినిపింపు డభ్రాంబరములార! తరళతారోపమమదశ్రుబిందూత్కరము గ్రథియించి శోకసూత్రాల రచియించితిం దీని, నీ యశ్రుసందృబ్ధమాలను జెలికి నాచిన్నెగా నర్పణముసేయ గైకొనుడు! ఓ పంచభూతములార! ఓ మాధవీ! ఓ పయోదాన్వయవరా! ఓ కౌముదీ! ఏగిరండింక మీరేగి రారండు నానాతియల్క పోనడచి మఱిరండు వచ్చునప్పటిదనుక వపువెల్ల వేయి కనులుగా నే తెన్నులను గాంచుచుందు. ******